రామరాజు, భీమ్‌.. మళ్లీ ఇలా!

తెలుగు చిత్రసీమతో పాటు భారతీయ చిత్రసీమకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం 'రౌద్రం రణం రుధిరం' (ఆర్‌ఆర్‌ఆర్‌). కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వల్ల షూటింగ్‌ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుందని చెప్తూ చిత్రానికి సంబంధించిన కొత్తవార్త చెబుతామంటూ చిత్రబృందం తమ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించింది. అనుకున్నట్లుగానే సినిమాకి సంబంధించిన అన్నీ విభాగాలవాళ్లు షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి ఏం పనులు చేశారనే అంశంతో పాటు, ఈరోజు నుంచే షూటింగ్‌ జరగనుందని చివర్లో హీరోస్‌ రెడీ, యాక్షన్‌ అని జక్కన్న చెప్పగానే యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ బుల్లెట్‌పై, రామ్‌చరణ్‌ గుర్రంపై వచ్చే సన్నివేశాన్ని ఈ వీడియోలో చూపించారు. అంతేకాదు త్వరలోనే రామరాజు ఫర్‌ భీమ్‌ ప్రోమో వస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఇక ఎన్టీఆర్‌ పోషించే పాత్ర కొమరం భీం పుట్టినరోజు అక్టోబర్‌ 22. 'వుయ్‌..ఆర్‌..బ్యాక్'‌ అంటూ 'రామరాజు ఫర్‌ భీమ్‌' టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే రామ్‌చరణ్‌కు సంబంధించిన అల్లూరి పాత్రను ఎన్టీఆర్‌ వాయిస్‌లో పరిచయం చేసిన వీడియో విడుదలై సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ చిత్రానికి డి.వి.వి.దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇంకా చిత్రంలో సీతగా అలియాభట్‌ నటిస్తుండగా, అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.