చెర్రీ ఇప్పటికే చాలా ఆలస్యం చేశావ్‌: ఎన్టీఆర్‌

జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కలిసి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్’‌ (రౌద్రం రణం రుధిరం’). దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా నుంచి దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్‌ 22న ఓ ప్రత్యేక సర్‌ప్రైజ్‌ విడుదల కానుంది. ‘రామరాజుఫర్‌భీమ్‌’ పేరుతో రానున్న ఈ సర్‌ప్రైజ్‌కి సంబంధించి ప్రత్యే్ గ్లిమ్స్‌ను బుధవారం రామ్‌చరణ్‌ ట్విటర్‌ వేదికగా విడుదల చేశారు. ‘‘తారక్‌ బ్రదర్‌.. నిన్ను టీజ్‌ చేసేవిధంగా ఓ గ్లిమ్స్‌ విడుదల చేస్తున్నా. నీలాగా కాకుండా చెప్పిన సమయానికి (గురువారం ఉదయం 11 గంటలకే) ‘రామ్‌రాజుఫర్‌భీమ్‌’ విడుదల చేస్తా’’ అని చెర్రీ ట్వీట్‌ చేశారు. ఇందుకు స్పందించిన ఎన్టీఆర్‌..‘‘సోదరా.. ఇప్పటికే ఐదు నెలలు ఆలస్యమయ్యావనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. జక్కన్నతో డీలింగ్‌ కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏదైనా జరగొచ్చు!! ఏది ఏమైనా.. పూర్తి వీడియో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’.. అంటూ జవాబిచ్చారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మిస్తున్నారు. చిత్రంలో రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్‌ కొమరంభీమ్‌గా కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటి ఆలియాభట్ చెర్రీ సరసన సీతగా నటిస్తుండగా, ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలివీయా మోరీస్‌ సందడి చేయనుంది. ఇక బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌తో పాటు తమిళనటుడు సముద్రఖని‌, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌ మాటలు రాస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.