జనతా కర్ఫ్యూ అంటే పబ్లిక్‌ హాలీడే కాదు

జనతా కర్ఫ్యూ అంటే పబ్లిక్‌ హాలీడే కాదని.. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ కోరారు. కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రోజురోజూకీ విషపు కోరలు చాస్తున్న తరుణంలో సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితమైన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు 'జనతా కర్ఫ్యూ'కు తమ మద్దతు ప్రకటించారు.

సామాజిక మాధ్యమాల వేదికగా సల్మాన్‌ ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. 'అందరికీ నమస్కారం. నా పేరు సల్మాన్‌ఖాన్‌. కరోనా వైరస్‌ వల్ల ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తోన్న వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు నా విజ్ఞప్తి ఏంటంటే.. ప్రభుత్వం చెబుతున్న నియమాలను పాటించండి. ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేయకండి. కరోనా వైరస్‌కు ఎవరూ అతీతులు కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కనీస జాగ్రత్తలను పాటించి.. బయటకు రాకండి. ఇది పబ్లిక్‌ హాలీడే కాదు.' అని పేర్కొన్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.