‘సామజవరగమన’.. కేటీఆర్‌ మనసు దోచేసిందట

తెలంగాణ మంత్రి, టిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌ మంచి సినీప్రియులన్న సంగతి అందరికీ తెలిసిందే. రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా తీరిక చూసుకోని మరీ సినిమాలు చూస్తూ వాటిపై తన అభిప్రాయాలు ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. తాజాగా ఆయన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని హిట్‌ గీతం ‘సామజవరగమన’ గురించి ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం స్విట్జర్‌లాండ్‌ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడ మంచు కురుస్తున్న చక్కటి చిత్రాలను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ ‘సామజవరగమన’పై ట్వీట్‌ చేశారు. ‘‘విమానం కాస్త ఆలస్యమైంది. అప్పుడు స్విట్జర్లాండ్‌లో ఉదయం 3.30 అవుతోంది. ఆ సమయంలో 'సామజవరగమన' పాట విన్నాను. నాకు మంచి కంపెనీ ఇచ్చిందీ సాంగ్‌. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ పాట వెంటనే నా ప్లేలిస్ట్‌లో చేరిపోయింది. తమన్‌.. ఈ సాంగ్‌తో మిమ్మల్ని మీరే మించిపోయారు’’ అంటూ ట్వీటర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు కేటీఆర్‌. దీనిపై తమన్‌ కూడా స్పందించారు. ‘‘మీరు మా పాట పట్ల ఇలా స్పందించడం సంతోషాన్నిస్తోంది. మీ మాటలతో ఈ పాట స్థాయి మరింత పెరిగింది’’ అని కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ గీతం సినీ సంగీత ప్రియుల్ని ఓ ఊపు ఊపేయడమే కాక.. నెట్టింట అత్యధిక ప్రజాదరణ పొందిన పాట గాను కీర్తి దక్కించుకుంది. యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన దక్షిణాది సినీ గీతంగానూ రికార్డు కొట్టింది. తమన్‌ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించగా.. సిద్‌ శ్రీరామ్‌ ఎంతో చక్కగా ఆలపించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.