మరో ప్రయోగానికి సిద్ధమైన సామ్‌..

కెరీర్‌ తొలినాళ్లలో అందరు కొత్త నాయికల్లాగే గ్లామర్‌ పాత్రలతో మెప్పించిన సామ్‌.. స్టార్‌గా మారాక తనలోని అసలు సిసలు నటిని బయటకు తెచ్చింది. నటనా ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిలో అగ్ర నాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది. త్వరలోనే ఆమె ‘ది ఫ్యామిలీమ్యాన్‌ 2’ వెబ్‌సిరీస్‌తో డిజిటల్‌ మాధ్యమాల పైనా సందడి చేసేందుకు ముస్తాబవుతోంది. ఇప్పుడీ క్రమంలోనే ఈ భామ మరో ప్రయోగానికీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన మామ అక్కినేని నాగార్జున బాటలోనే ఆమె కూడా బుల్లితెరపై ఓ రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. అయితే ఇది కూడా డిజిటల్‌ మాధ్యమాలపై ప్రసారమయ్యే ఓ టాక్‌ షోనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఓటీటీ ప్లాట్‌ ఫాం మరెవరిదో కాదు అల్లు అరవింద్‌ ‘అహ’. ఇప్పటికే ఈ టీం సామ్‌తో షో చేయించేందుకు సంప్రదింపులు మొదలు పెట్టిందని, ఆమె కూడా దీనికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో విజయ్‌ సేతుపతి, నయనతారలతో ఓ సినిమా చేస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.