ప్రభాస్‌ కోసం సింగీతం

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు పెట్టింది పేరు సింగీతం శ్రీనివాసరావు. నేపథ్యం ఏదైనా ఆయన మార్క్‌ కనిపిస్తుంది. అలాంటి లెజండరీ దర్శకుడు చాలా కాలం తర్వాత భారీ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యారు. ప్రభాస్‌ కథానాయకుడుగా నాగ అశ్విన్‌ ఓ చిత్రం తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాకు సింగీతం స్క్రిప్టు మెంటార్‌గా వ్యవహించనున్నారు. సోమవారం సింగీతం పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించింది చిత్ర బృందం. ‘‘ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నెరవేరింది. మా ప్రాజెక్టులోకి సింగీతం శ్రీనివాసరావు గారిని స్వాగతిస్తున్నాం. ఆయన సృజనాత్మక రచనలు మాకు మార్గదర్శకంగా నిలుస్తాయి. క్వారెంన్‌టైన్‌ సమయంలోనూ మా సినిమా కోసం పనిచేస్తున్న ఆయనకు ధన్యవాదాల’’ని పేర్కొంది వైజయంతీ మూవీస్‌ నిర్మాణ సంస్థ. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తుంది. సింగీతం రాకతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.




Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.