పేదల కోసం ఎస్పీ బాలు గానం

కరోనా ప్రభావం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటున్న పేదలను ఆదుకునేందుకు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ‘‘మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంట పరిస్థితుల్లో నావంతు సహాయం చేయాలనుకుంటున్నా. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో నన్ను పాడమని ఫేస్‌బుక్‌ ద్వారా అడగొచ్చు. ఆ మాధ్యమం ద్వారా నేను పాడుతా. శని, సోమ, బుధ, గురువారాల్లో రాత్రి 7 గంటల నుంచి 7.30 గంటల వరకు మీరు కోరిన పాటల్ని పాడుతా. ఇందు కోసం కనీస రుసుం రూ.100 ఇవ్వాలి. ఇలా సేకరించిన డబ్బుకి, నా వంతుగా మరికొంత నగదును కలిపి పేదలకు ఇవ్వాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు. ఎస్పీబీ ఫ్యాన్స్‌ ఛారిటబుల్‌ ఫౌండేషన్‌ ద్వారా ఎస్పీబీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఛారిటీకి సంబంధించిన బ్యాంకు వివరాలను కూడా ఫేస్‌బుక్‌ ఖాతాలో ప్రస్తావించారు. ఇదిలా ఉండగా కరోనాపై అవగాహన కల్పిస్తూ తెలుగులో వెన్నెలకంటి, తమిళంలో వైరముత్తు రాసిన పాటలను ఎస్పీబీ పాడారు. ఇవి సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.