ఐసీయులో గాయకుడు ఎస్పీ బాలు

ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు - నటుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ఓ బులిటెన్‌ విడుదల చేశాయి.‘‘ ఆయన ఆగస్టు 5న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా, ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైంది. కానీ గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురి కావడంతో వైద్య నిపుణుల సూచన మేరకు వెంటనే ఆయన్ని ఐసీయూకి తరలించారట. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది’’ అని ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తనకు కరోనా సోకిందని అయినా.. చాలా ఆరోగ్యంగా ఉన్నానని పేర్కొంటూ ఆగస్టు 5న ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు ఎస్పీ బాలు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అందులో తెలిపారు. మూడు రోజులుగా అస్వస్థతగా ఉండటంతో ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు చెప్పారు. కరోనా పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, మందులు ఇచ్చి హోంక్వారంటైన్‌లో ఉండమని వైద్యులు సూచించినట్లు పేర్కొన్నారు. అయితే కుటుంబసభ్యులను ఇబ్బందుల్లో పడేయటం ఇష్టంలేక ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.