సుశాంత్‌ మరణంపై ఈడీ-సీబీఐల ఉమ్మడి దర్యాప్తుకి అంగీకరించిన పీఎమ్‌

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మరణంపై ఇప్పటికే అనేక రకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సుశాంత్‌ ఆత్మహత్యపై ప్రముఖ బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సీబీఐ, ఎన్‌ఐఏ, ఈడీలు ఉమ్మడి దర్యాప్తు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ పంపారు. ఇప్పుడా లేఖకు ప్రధాని మోదీ అంగీకారం తెలిపారు. ఇదే విషయాన్ని న్యాయవాది ఇష్కరన్‌ సింగ్‌ భండారి ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. అయితే ప్రధానికి సుబ్రహ్మణ్య స్వామి లేఖ రాయడం ఇదే మొదటిసారి కాదు. జులై 15, 2020న ఓ లేఖ రాశారు. ఆ తరువాత జులై 30న ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ ఉమ్మడిగా దర్యాప్తు చేసి కేసును త్వరగా తేల్చాలంటూ కూడా లేఖ రాశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌ సింగ్ జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ప్రతిరోజూ సామాజిక మాధ్యమాల్లో సుశాంత్‌ మరణంపై ఏదో ఒక విధంగా చర్చ జరుగుతూనే ఉంది. బాలీవుడ్‌లో బంధుప్రీతి వల్లే సుశాంత్‌ చనిపోయారని ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కొంతమంది నటీనటులపై ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ‘సడక్‌ 2’ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ని చూసిన కొంతమంది డిజ్‌లైక్‌ చేస్తూ..ఈ సినిమాని ఎవరూ చూడొద్దని కామెంట్స్ పెడతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.