‘లక్ష్మీబాంబ్‌’తో నేను ఉండను: లారెన్స్‌

తమిళ నృత్య, చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్‌ హిందీ సినిమా ‘లక్ష్మీబాంబ్‌’ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తమిళంలో వచ్చిన ‘కాంచన3’ సినిమాకు రీమేక్‌గా దీన్ని నిర్మిస్తున్నారు. హిందీలో రాబోతున్న ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్నారు. లారెన్స్‌ దర్శకత్వంలో రూపొందుతోంది. లారెన్స్‌ ఈ ప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే కారణాలను సామాజిక మాధ్యమం ద్వారా వివరించారు. నాకు ఆత్మాభిమానం ఉంది కాబట్టే ‘లక్ష్మీబాంబ్‌’ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఒకటి’ ‘నా అనుమతి లేకుండా నాతో చర్చించకుండా పోస్టర్‌ను విడుదల చేశారు. ఇలా చేశారని నాకు మూడో వ్యక్తి ద్వారా తెలిసింది. ఓ దర్శకుడిగా ఇది ఎంత బాధాకరంగా ఉంటుందో నాకు తెలుసు. నాకు పోస్టర్‌ డిజైన్‌ నచ్చలేదు. ఇలాంటి ఘటన ఏ దర్శకుడికీ జరగకూడదు. ఇది నా సినిమాకు రీమేక్‌ కాబట్టి నేను స్క్రిప్ట్‌ను కూడా వెనక్కి ఇచ్చేయాలని అడగను. అలాగని ఈ సినిమాకు దర్శకుడిగా కొనసాగలేను. నాకు అక్షయ్‌ కుమార్‌ సర్‌ అంటే ఎంతో అభిమానం. చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆశిస్తున్నాను’ అని పేర్కొన్నారు రాఘవ.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.