‘సాహో’ కథను లీక్‌ చేస్తున్న సీన్స్‌ ఇవేనట!!

‘సాహో’ కథ ఏంటి? ప్రభాస్‌ పాత్ర ఎలా ఉండబోతుంది? అన్నది ట్రైలర్‌తోనే క్లుప్తంగా చెప్పేశాడు దర్శకుడు సుజీత్‌. అయితే అందరూ ఊహించిన దానికి భిన్నంగా ‘సాహో’లోని ఓ సర్‌ప్రైజ్‌ స్టోరీ ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతుందట. ఓ అనూహ్యమైన ట్విస్ట్‌తో ప్రభాస్‌ పాత్ర కూడా ఓ సరికొత్త కోణంలో దర్శనమివ్వబోతుందట. ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్లే ఈ చిత్ర అసలు కథను లీక్‌ చేస్తున్నాయి అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి దీనిలో వాస్తవమెంతన్నది తెలియనప్పటికీ అందులోని విషయాలు చూస్తుంటే ‘సాహో’ అసలు కథ ఇదేనేమోనని బలంగా నమ్మక తప్పడం లేదు. ముంబయిలో రూ.2 వేల కోట్ల భారీ మొత్తం చోరీ జరగడం, ఆ తర్వాత దాని వెనకున్న ముఠాను పట్టుకునేందుకు అండర్‌ కవర్‌ కాప్‌ అశోక్‌ చక్రవర్తిగా ప్రభాస్‌ రంగంలోకి దిగడం వంటి అంశాలు అందరికీ తెలిసినవే. అయితే అసలు కథేంటంటే.. ప్రభాసే ఆ భారీ చోరీకి పాల్పడతాడని, ఆ ట్విస్ట్‌ సినిమా చివరిలో అందరికీ తెలుస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ట్రైలర్‌ చివర్లో ప్రభాస్‌ను పోలీసులు అరెస్టు చేయడం, శ్రద్ధా.. ప్రభాస్‌ తలకు గన్‌ గురిపెడుతూ ‘‘ఇక్కడ కాల్చడానికి ఏం లేదు.. మొత్తం ఇక్కడే ఉంది’’ అని చెప్పడం వెనుక అసలు రహస్యమదేని తెలుస్తోంది. అంతేకాదు.. ‘‘మనం డే అండ్‌ నైట్‌ లాగా.. ఒకటి వస్తే మరొకటి వెళ్లిపోవాలి’’ అని ట్రైలర్‌లో శ్రద్ధా మరో డైలాగ్‌ చెప్పడం వెనుకా అసలు కారణం ఇదేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ‘సాహో’ను ‘కిక్‌’కు ప్రీక్వెల్‌ అనో సీక్వెల్‌ అనో చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ‘కిక్‌’లో రవితేజ కూడా ఓ మంచి పని కోసం దొంగతనం చేసి, ఆఖరికి తెలివిగా పోలీస్‌ ఆఫీసర్‌ అవతారమెత్తుతాడు. ఇప్పుడిదే అంశం ‘సాహో’లో అటు ఇటుగా ఉన్నట్లు అవుతుంది.సంబంధిత వ్యాసాలు
సంబంధిత ఫోటోలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.