టైటిల్‌ చూసి.. స్టోరీ చెప్పేస్తున్నారు!
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మహేష్‌ 25వ సినిమా సర్‌ప్రైజ్‌లు సినీ ప్రియులకు కనులవిందు అందించాయి. మహేష్‌ ముందుగా చెప్పినట్లుగానే తన 43వ పుటినరోజు కానుకగా ‘మహర్షి’ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌, టీజర్‌లతో అభిమనులను ఫుల్‌ ఖుషీ చేసేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వనీ దత్‌, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రాక్‌ స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఇందులో మహేష్‌ రిషి పాత్రలో కనిపించబోతుండగా.. ఆయన స్నేహితుడిగా అల్లరి నరేష్‌ ‘రవి’ పాత్రలో కనువిందు చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు టైటిల్‌ను చూసి మరిని ఆసక్తికర విషయాలను బయటకు తెస్తున్నారు మహేష్‌ అభిమానులు. తాజాగా విడుదలైన ‘మహర్షి టైటిల్‌ లోగో డిజైన్‌ ఆధారంగా చిత్ర కథ విషయమై సోషల్‌ మీడియాలో పలు ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. చిత్ర లోగోపై పెద్ద రీసెచ్‌నే పూర్తిచేశారు ప్రిన్స్‌ అభిమానులు.

‘మహర్షి’ టైటిల్‌లో స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టిని మీరు గమనించారా? టైటిల్‌లో ‘ర్షి’ అక్షరంలో ‘ష’ఒత్తుకు పైన చక్కగా చెక్కినట్లు కనిపిస్తుంది. అలాగే టైటిల్‌ లోగో కింద నలుపు తెలుపు రంగుల్లో ఎత్తైన భవనాలు కనిపిస్తుండగా.. టైటిల్‌ పైన కొబ్బరి చెట్లూ, పొలాలతో గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. దీన్ని బట్టి ఈ చిత్ర కథ కొంత భాగం పల్లెటూరి వాతావరణంలోనూ మిగతాది అమెరికా నేపథ్యంలోనూ సాగనున్నట్లు అర్థమవుతుంది. ‘మహర్షి’లో చివరి ‘ర్షి’ని గమనిస్తే అది మహేష్‌ ‘రిషి’ పాత్ర పేరును ప్రతిబింబిస్తుండగా దానికి ముందున్న మిగిలిన రెండు అక్షరాలు ‘మహ’. ఒకవేళ ఇది పూజా హెగ్డే పేరు అయి ఉండొచ్చని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక టైటిల్‌ బాగ్రౌండ్‌లో కనిపించీ కనిపించనట్లుగా ఉన్న మ్యాథమెటిక్‌ సూత్రాలను బట్టి.. ఇందులో మహేష్‌ గణిత శాస్త్ర విభాగానికి చెందిన విద్యార్థిగా దర్శనమివ్వచ్చేమో అంటున్నారు. మొత్తానికి ఇలా టైటిల్‌ను చూసి కథనంతా వల్లెవేసేస్తున్నారు మహేష్‌ అభిమానులు.

                                                                       

                                                                                                               


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.