చిత్రమేదైనా టిక్‌టాక్‌ ప్రచారస్త్రంగా..

సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం పదునెక్కుతుంది. రకరకాల మాధ్యమాల్లో చిత్ర బృందాలు వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తుంటాయి. సినిమా ఎలా తీశామనే దానికంటే, తీసిన చిత్రాన్ని ఏ స్థాయిలో ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లామన్నదే ముఖ్యమని భావిస్తూ ప్రచార కాండని కొనసాగిస్తుంటాయి. ప్రస్తుతం ఈ ప్రచార పర్వానికి సరికొత్త మాధ్యమాలు వేదికలుగా మారుతున్నాయి. కొంత కాలం క్రితం వరకు ఏదైనా చిత్రానికి ప్రచారం కావాలంటే పేపర్లు, టీవీ ఛానెళ్ల వైపే దృష్టి సారించే వాళ్లు.. ఇక సామాజిక మాధ్యమాల జోరు పెరిగాక యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విటర్‌లు ఈ ప్రచార కాండకు వేదికలుగా నిలుస్తున్నాయి. ఇక ప్రస్తుతానికొస్తే టిక్‌టాక్‌ అనేది చిత్రసీమల ప్రచార పర్వాలకు ఓ వజ్రాయుధంలా కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో నెటిజన్లంతా టిక్‌టాక్‌లో నచ్చిన సినీతారల అభినయాన్ని, వారి మాటలను తమదైన శైలిలో స్పూఫ్‌ చేస్తూ ముచ్చట తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలా చిత్ర వర్గాలు టిక్‌టాక్‌ను లక్ష్యంగా చేసుకోని తమ చిత్రాలను యువతరానికి దగ్గర చేస్తున్నాయి. కొత్తగా వస్తున్న తమ సినిమాల్లోని పాటలు, లేదా టీజర్‌లలోని డైలాగ్‌లను టిక్‌టాక్‌లలో వదులుతూ వాటిని తమదైన శైలిలో అభినయించి చూపాల్సిందిగా ప్రత్యేక ఛాలెంజ్‌లను విసురుతున్నాయి. కొందరు నాయకానాయికలైతే టిక్‌టాక్‌లో సెలబ్రిటీలుగా ఉన్న యువతరంతో కలిసి డ్యాన్సులు వేయడం, డైలాగ్‌లు చెప్పడం వంటివి చేసి తమ చిత్రాలకు సరికొత్త రీతిలో ప్రచారం కల్పించుకుంటున్నాయి. ఆ మధ్య వచ్చిన ‘సీత’ విషయంలో కాజల్, ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’ చిత్రం కోసం పాయల్‌ రాజ్‌పుత్, ‘90 ఎం.ఎల్‌’ కోసం కార్తికేయ ఈ తరహా ప్రయత్నాలు చేసి తమ చిత్రాలను మరింత వేగంగా యువతరానికి చేరువ చేయగలిగారు. ఇప్పుడు త్వరలో రాబోతున్న ‘వెంకీమామ’, ‘ప్రతిరోజూ పండగే’ చిత్రాల కోసం కూడా ఇదే తరహా మార్గాన్ని అనుసరిస్తున్నాయి సదరు చిత్ర వర్గాలు. ఇప్పటికే ఈ చిత్రాల్లో నటిస్తున్న నాయికలు రాశీ ఖన్నా, పాయల్‌లు ఆయా చిత్రాల్లోని పాటలు, డైలాగ్‌లను టిక్‌టాక్‌లో అభినయించి చూపిస్తూ యువతరానికి కొత్త ఛాలెంజ్‌లను ఇస్తున్నాయి. అన్నట్లు ఇందులో ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో రాశీ ఓ టిక్‌టాక్‌ సెలబ్రిటీగానే కనిపించబోతుంది. అందుకే ఆ చిత్రాన్ని టిక్‌టాక్‌ ద్వారా ప్రచారం చేసే బాధ్యతను తన భుజాలపైనే వేసుకుంది. కేవలం ఇవే కాదు.. ముందు ముందు రాబోతున్న ‘అల.. వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల కోసం ఆయా చిత్ర బృందాలు టిక్‌టాక్‌ వేదికగా సరికొత్త రీతిలో ప్రచార పర్వాన్ని షురూ చెయ్యాలని ప్రణాళికలు రచించుకుంటున్నాయట.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.