ట్రంప్‌ హీరోగా మరో ‘బాహుబలి’ వచ్చేసింది!
అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు మన మాహిష్మతి సామ్రాజ్యానికి రాజుగా మారారు. యువరాజుగా బాధ్యతలు చేపట్టి రాజ్యంలో శాంతిస్థాపనకు శత్రువులతో పోరాడారు. విజయం సాధించి శివగామి దేవీ మన్ననలు పొందారు. ప్రజల మధ్య ఓ సామాన్యుడిలా ప్రత్యక్షమై వారికి చేరువయ్యారు. ఇదంతా మన జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రంలో ప్రభాస్ పోషించిన బాహుబలి పాత్ర కదా అనుకుంటున్నారా..! అవును. కానీ, మన యంగ్‌ రెబల్‌స్టార్‌ స్థానంలో ట్రంప్‌ నటించారు మరి. ఆశ్చర్యపోతున్నారా.. ఇదంతా జరిగింది ఓ మీమ్‌ వీడియోలో లెండి. వివరాల్లోకి వెళితే..


అమెరికా అధ్యక్షుడు రేపు భారత్‌లో తొలిసారి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. భారత పర్యటనపై ఎంతో ఆసక్తిగా వేచిచూస్తున్నానని మరోసారి తన మనసులో మాటను.. మన దేశంపై ఉన్న అభిమానాన్ని ట్రంప్‌ ట్విటర్‌లో వ్యక్తపరిచారు. దీనికి ఓ వీడియోను జత చేశారు. అది బాహుబలి చిత్రంలోని కొన్ని కీలక ఘట్టాలను కలిపి చేసింది. అయితే అందులో ప్రభాస్ ఫేస్‌ను ట్రంప్‌ ముఖంతో మార్ఫ్‌ చేశారు. విభిన్నంగా ఉండే అధ్యక్షుడి హావభావాల్ని సైతం జోడించారు. ఇరు దేశాల సమైక్యత కోసం శత్రువుల్ని చెండాడి ట్రంప్‌ విజయం సాధించినట్లు అందులో చూపించారు. అలాగే చిత్రంలో సామాన్య ప్రజల పిల్లల్ని ప్రభాస్‌ తన భుజాలపై మోస్తూ వారిని ఆశ్చర్యాన్ని గురిచేసే సన్నివేశంలో.. ట్రంప్‌ తన కూతురు ఇవాంకా, కుమారుడు జూనియర్‌ డొనాల్డ్‌ను మోయడం నవ్వులు పూయిస్తోంది. అలాగే శివగామి స్థానంలో ప్రథమ మహిళ మెలనియాను చూపించారు. విజయం సాధించి వచ్చిన ట్రంప్‌నకు ప్రధాని మోదీతో పాటు వేలాది మంది ప్రజలు స్వాగతం పలుకుతున్నట్లుగా వీడియోను మార్చారు. ఇదంతా ఆయన రెండు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేస్తున్నట్లుగా వీడియోను తీర్చిదిద్దారు. ఈ వీడియో మొత్తం 'సాహోరే బాహుబలి' పాటకి హిందీ వెర్షన్‌ అయిన 'జీయోరే బాహుబలి' థీమ్‌సాంగ్‌తో కొనసాగుతుంది. ట్రంప్‌ దీన్ని రీట్వీట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. మూడు గంటల్లో దాదాపు 63వేల మంది లైక్ చేశారు.

ఈ వీడియోను ట్విటర్‌లో 'సోల్‌' పేరిట ఉన్న ఓ వ్యక్తి రూపొందించారు. తనకు తాను మీమటేషియన్‌గా, జీఎఫ్‌వై వర్సిటీలో మీమాలజీ ప్రొఫెసర్‌గా చెప్పుకొన్నారు. గతంలో కూడా ట్రంప్‌నకు సంబంధించిన పలు వీడియోలను రూపొందించినట్లు 'సోల్‌' ట్విటర్‌ ఖాతా ద్వారా తెలుస్తోంది. ఆమె ట్రంప్‌ను అభిమానించే వ్యక్తిగా అర్థమవుతోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.