ట్రంప్‌ మెచ్చిన ‘శుభ్‌ మంగళ్‌’

తా
జాగా విడుదలైన ఓ బాలీవుడ్‌ చిత్రంపై అమెరికా అధ్యక్షుడి దృష్టి పడింది. ఈ మేరకు ట్రంప్‌ సదరు బాలీవుడ్‌ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్‌ కూడా పెట్టారు. 'అంధాధున్‌' చిత్రంతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్న ఆయుష్మాన్‌ ఖురానా కథానాయకుడిగా నటించిన సినిమా 'శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌'. స్వలింగ సంపర్కుల(గే) మధ్య ఉండే ప్రేమాభిమానులను గురించి తెలియజేసే విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి హితేశ్‌ కేవల్యా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానాతోపాటు జితేంద్ర కుమార్‌ ప్రధాన పాత్రలో నటించారు. శుక్రవారం ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది.


'శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌' సినిమా విడుదలను తెలియజేస్తూ ఇటీవల స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్త పీటర్‌ టాట్చెల్‌ ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. 'స్వలింగ సంపర్కుల మధ్య ఉండే ప్రేమాభిమానులను తెలియజేసే విధంగా బాలీవుడ్‌లో తెరకెక్కిన 'శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌' చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. అలాగే ఈ సినిమా చూశాక స్వలింగ సంపర్కులపై ఉన్న చిన్నచూపు పోతుందని ఆశిస్తున్నాను' అని పీటర్‌ టాట్చెల్‌ పేర్కొన్నారు. అయితే పీటర్‌ పెట్టిన ట్వీట్‌పై ట్రంప్‌ స్పందించారు. పీటర్‌ పెట్టిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ.. 'గ్రేట్‌' అని పేర్కొంటూ రిప్లై ఇచ్చారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.