‘దిశ’ చిత్రానికి నాకెవరి అనుమతి అక్కర్లేదు

‘‘దిశ’ చిత్రం తీసేందుకు నాకెవరి అనుమతి అవసరం లేదు’’ అంటున్నారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ప్రస్తుతం ఆయన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ అత్యాచార ఘటనపై ఓ సినిమా తీసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కథ విషయమై ఆయన కసరత్తులు కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే అత్యాచార ఘటన కారణంగా పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నిందితుల కుటుంబాలను వర్మ ఇటీవల కలిశారు. ఇప్పటికే వాళ్ల నుంచి కొన్ని కీలక విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాలు సమగ్రంగా తెలుసుకునేందుకు తాజాగా శంషాబాద్‌ ఏసీపీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ దిశ ఘటన గురించి తెలుసుకునేందుకే ఏసీపీని కలిసినట్లు చెప్పారు. దిశ చిత్రం తీసేందుకు ఆయన కుటుంబ సభ్యుల అనుమతి కానీ, మరింకెవరి అనుమతి కానీ తనకు అవసరం లేదని అన్నారు. ఓ దర్శకుడిగా ఈ సమాజంలో జరిగిన సంఘటనల గురించి సినిమా తీసే హక్కు తనకుందన్నారు. త్వరలోనే మరికొంత మంది కీలక వ్యక్తులను కలుసుకోని వాళ్ల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోబోతున్నట్లు చెప్పారు. ఈ చిత్రం చాలా ఎమోషనల్‌గా ఉండనున్నట్లు క్లారిటీ ఇచ్చారు. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు సెట్స్‌పైకి తీసుకెళ్తారు? ప్రధాన పాత్రల్లో ఎవరు నటిస్తారన్నది? క్లారిటీ ఇవ్వలేదు. ఏదేమైనా ఈ ఘటనపై వర్మ చూపిస్తున్న శ్రద్ధ చూస్తుంటే మరో కొన్ని నెలల్లోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్లు అర్థమవుతోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.