వర్మకు వినోదం వద్దా.. వివాదమే ముద్దా??

తెలుగు చిత్రసీమకు కొత్త నడకలు నేర్పినవాడు.. మేకింగ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించినవాడు.. కథ, కథనాలకు సరికొత్త సొబగులద్దినవాడు.. రామ్‌గోపాల్‌ వర్మ పేరు చెప్పగానే ఓ దశాబ్దంన్నర క్రితం వరకు వినిపించిన పేర్లివి. కానీ, ఇప్పుడు వర్మ అంటే వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. కేవలం తన వివాదాస్పద ప్రచార పర్వాన్నే నమ్ముకొని బాక్సాఫీస్‌ వద్ద తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్న ఓ సాదాసీదా దర్శకుడు. ఇది కొంతకాలంగా ఆయన సినిమాలను చూసి ప్రేక్షకులు అంటోన్న మాటలివి. అయితే ఇది వారు ఆయన మీద కసితోనో కోపంతోనో సినీప్రియులంటున్న మాటలు కావు. ఆయన నుంచి వినోదం కోసం ఎదురు చూసీ చూసీ అనుకున్నది దొరకక అసహనం నుంచి పుట్టిన మాటలే. దీనికి తగ్గట్లుగానే ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న సినిమాల తీరు కూడా నడుస్తోంది. ఈ ఏడాది ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’తో రెండు తెలుగు రాష్ట్రాల్లో వివాదాల అగ్గి రాజేసిన వర్మ.. ఇప్పుడు మరోసారి అదే పంథాలో నడువబోతున్నాడు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరుతో మరోసారి వివాదాస్పద చిత్రాన్ని తెరపైకి తెచ్చాడు. ఇప్పటికే బయటకొచ్చిన పాటలు, పోస్టర్లతో తన లక్ష్యం ఏంటన్నదీ చెప్పకనే చెప్పేశాడు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ లోగో పోస్టర్‌ను విడుదల చేస్తూ ఓ ఆసక్తికర వ్యాఖ్యను కూడా జోడించారు. ‘‘వివాదాస్పద పాత్రలతో నిండిన పూర్తి వివాదాస్పదంశాలు లేని చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’’ అని పేర్కొన్నారు. కానీ, సినీప్రియులు వర్మ నుంచి కోరుకుంటోంది ఇలాంటి వినోదం కాదని, ఆయన మార్కు అసలు సిసలు వినోదాల విందు భోజనమని గుర్తిస్తే మేలు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.