అప్పుడు గీతతో అలా .. ఇప్పుడు సువర్ణతో ఇలా..

అప్పుడు గీతతో అలా.. ఇప్పుడు సువర్ణతో ఇలా.. ఇది యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండకు సంబంధించింది. కొన్ని సినిమాల్లోని పలు హావభావాలు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటాయి. ‘గీత గోవిందం’లో కథానాయిక రష్మికను పెళ్లి చేసుకున్నట్లు విజయ్‌ ఊహించుకునే సన్నివేశంలో వచ్చే కొన్ని మూమెంట్స్‌ యువతను అమితంగా అలరించాయి. ప్రతి అమ్మాయి విజయ్‌ లాంటి భర్త రావాలని, ప్రతి అబ్బాయి రష్మికలాంటి భార్య కావాలని కోరుకున్నారంటే అతిశయోక్తి కాదు. గీత పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. అదే తరహాలో ఇప్పుడు ఐశ్వర్య రాజేష్‌ ఆకట్టుకోబోతుంది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్‌ నటిస్తున్న చిత్రం ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’. తాజాగా ఈ చిత్రంలోని ఓ పోస్టర్‌ను విడుద చేశారు. కథానాయికకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ ఇది. ఈ పోస్టర్‌లో ఐశ్వర్య రాజేష్‌ తలకు టవల్ చుట్టుకుని కూరగాయలు కోస్తూ ఉండగా.. విజయ్‌ వెనక నుంచి పట్టుకుంటాడు. గీతగోవిందంలో రష్మికతో ఉండే సన్నివేశాలు ఎలా ఉంటాయో ఇప్పుడు ఐశ్వర్యతో ఉన్న సన్నివేశం అలా తలపిస్తోంది. ఇందులో ఐశ్వర్య.. సువర్ణ అనే పాత్రలో కనిపిస్తుంది. అదన్న మాట సంగతి, అప్పుడు గీతతో అలా.. ఇప్పుడు సువర్ణతో ఇలా అంటే. ‘ప్రేమికుల రోజున మా శీనయ్యను కలుద్దురు’ అని ఈ చిత్రాన్ని పోస్ట్‌ చేసింది ఐశ్వర్య.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.