గూగుల్‌లో రౌడీ హవా.. రజనీ, అజిత్‌లను వెనుక్కు నెట్టి!!

ప్రతి తరంలో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ వెండితెరపై వెలుగులు విరజిమ్మడానికి రాకెట్‌లా తెరపైకి వచ్చి వాలుతునే ఉంటాడు. అలా ఇటీవల కాలంలో ఒకే ఒక్క చిత్రంతో దేశీయ సినీప్రియుల దృష్టినే తనవైపు తిప్పుకునేలా చేసిన నటుడు విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌రెడ్డి’ వంటి ట్రెండ్‌ సెట్టర్‌ హిట్‌తో ఇటు దక్షిణాది అటు ఉత్తరాది అని తేడా లేకుండా కోట్లాది మంది సినీప్రియులకు దగ్గరయ్యాడు ఈ రౌడీ హీరో. ఈ హీరో ఇప్పటి వరకు హిందీలో ఒక్క చిత్రం చేయకున్నా బాలీవుడ్‌లోని స్టార్‌ నాయికలందరూ అతడితో జోడీ కట్టేందుకు పోటీ పడుతున్నారంటే ప్రస్తుతం ఈ యువ హీరోకి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ రౌడీ హీరో తన క్రేజ్‌తో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గూగుల్‌లో 2019లో అత్యధిక మంది వెతికిన సినీతారల జాబితాను విడుదల చేయగా.. ఈ జాబితాలో దక్షిణాదిలోనే టాప్‌ స్టార్‌గా నిలిచారు దేవరకొండ. వాస్తవానికి ఈ హీరోకు గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం అంతగా కలిసి రాలేదు. 2018లో ఆయన ‘మహానటి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ వంటి చిత్రాలతో వరుస విజయాలు అందుకోగా.. ఈ ఏడాది మాత్రం భారీ అంచనాలతో తీసుకొచ్చిన ‘డియర్‌ కామ్రేడ్‌’ నిరాశపరిచింది. అయినా సరే ఈ ఫలితం సినీప్రియుల్లో రౌడీపై ఉన్న క్రేజ్‌ను ఏ మాత్రం తగ్గించలేకపోయిందనే చెప్పాలి. మరో విశేషమేంటంటే.. ఈ గూగుల్‌ జాబితాలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అజిత్‌, ప్రభాస్‌, విజయ్‌ వంటి క్రేజీ స్టార్లను సైతం వెనక్కు నెట్టాడు. ఈ యువ హీరో త్వరలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’గా ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. దీని తర్వాత ‘ఫైటర్‌’ అనే పాన్‌ ఇండియా చిత్రంతో అటు ఉత్తరాది.. ఇటు దక్షిణాది సినీప్రియుల్ని ఒకేసారి అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. దీనికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించనున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.