ఇన్‌స్టాగ్రామ్‌లో దక్షిణాది టాప్‌స్టార్‌ విజయ్‌

తొలుత సహాయక పాత్రలతో సినీరంగ ప్రవేశం చేసి అటు పిమ్మట ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో సోలో హీరోగా అలరించిన నటుడు విజయ్‌ దేవరకొండ. ‘అర్జున్‌రెడ్డి’ చిత్రంతో ఒక్కసారిగా తెలుగు చిత్రసీమలో స్టార్డమ్‌ దక్కించకున్న యువకథానాయకుడు. సామాజిక మాధ్యమాల్లోను హల్‌చల్‌ చేస్తున్న విజయ్‌ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్ల అనుసరణగణాన్ని సంపాదించి, దక్షిణాది చిత్రసీమలో మొదటి వరుసలో నిలిచారు. విజయ్‌ నటించిన ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం హిందీ, తమిళంలోనూ రీమేక్‌ అయ్యింది. అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. ఈ చిత్రం తరువాత నటించిన కొన్ని సినిమాలు తెలుగు-తమిళం విడుదల చేస్తూ తన పరిధి పెంచుకున్నాడు. గత ఏడాది ‘డియర్‌ కామ్రేడ్’ చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయళంలో విడుదలైంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భరత్‌ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఫైటర్‌’ (ఇంకా పేరుపెట్టని చిత్రం)లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ కూడా జరుపుకొంటోంది. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది. అనన్య పాండే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కరణ్ జోహార్ సహ నిర్మాత వ్యవహరిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళ భాషలతో పాటు హిందీలోనూ విడుదల చేయనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.