
రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈరోజు సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఓ పోస్టర్ని విడుదల చేసింది. పోస్టర్లో రానా ఆలివ్ గ్రీన్ డ్రెస్లో ఉండగా, సాయి పల్లవి తెలుగింటి అమ్మాయిలా లంగా వోణీ డ్రస్సు ధరించి రానా చేయి పట్టుకొని నడుస్తున్నట్లుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన ప్రధాన పాత్రధారులను పరిచయం చేసింది. ‘విరాటపర్వం’: రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ఆ మధ్య రానా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ కి మంచి స్పందనే లభించింది. 'విరాటపర్వం'పై ఇవన్నీ ప్రేక్షకుల్లో, చిత్రసీమలో అంచనాలను పెంచాయి. చిత్రంలో ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా నటిస్తోంది. నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.