‘బన్నీ19’.. కాస్త ఓపిక పట్టండి

‘‘అన్నీ అనుకున్నట్లు జరిగాకే బన్నీ19కు సంబంధించిన పూర్తి వివరాలు ప్రకటించగలుగుతాం’’ అంటోంది ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌. ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థలోనే ప్రొడక్షన్‌ నెం.6గా త్రివిక్రమ్‌ - అల్లు అర్జున్‌ కొత్త చిత్రం మొదలుకాబోతుంది. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత ఏడాది విరామం తీసుకోని బన్నీ చేస్తున్న చిత్రం కావడంతో సినీప్రియులంతా దీని కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టైలిష్‌ స్టార్‌ తెలుగు తెరపై అడుగుపెట్టి ఈ మార్చి 28కి 16 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఆయన కొత్త మూవీకి సంబంధించి ఏమైనా సర్‌ప్రైజ్‌ వస్తుందేమోనని ఆశపడ్డారు అభిమానులు. ఈ క్రమంలోనే బన్నీ19ను నిర్మిస్తున్న హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థను ట్యాగ్‌చేస్తూ ‘‘ఇంకా ఎన్నిరోజులు ఆగాలి’’ అని కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్‌ వేదికగా బదులిచ్చింది. ‘‘మేం ప్రతిఒక్కరి మనోభావాలకు విలువిస్తాం. త్రివిక్రమ్‌ - బన్నీ కాంబినేషన్‌ కోసం మీరెంత ఆతృతగా ఎదురుచూస్తున్నారో... మేమూ అంతే ఆసక్తిగా చూస్తున్నాం. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగాకే మీకు పూర్తి వివరాలు ప్రకటించగలుగుతాం. దయచేసి అంతవరకు ఓపిక పట్టండి. త్వరలో మరిన్ని అప్‌డేట్స్‌తో ముందుకొస్తాం’’ అని ట్వీట్‌లో వెల్లడించారు.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.