33 ఏళ్ల కెరియర్‌లో.. తొలిసారి వివరణ ఇస్తున్నా!

గపతి బాబు.. ప్రతినాయకుడు, సహాయనటుడిగా మారి తానేంటో నిరూపించుకున్న కథానాయకుడు. ఏ పాత్రలోనైనా తన మార్క్‌ చూపిస్తాడు. ఈయన నటించిన చిత్రాలు దాదాపు హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంటాయి. అందుకే ఈయన కోసం ప్రత్యేకంగా పాత్రలు సృష్టించేవారూ ఉన్నారు. మరి ఇలాంటి నటుడు ఓ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడంటే కారణం ఏమై ఉంటుంది? అనే సందేహం కలగక మానదు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల తప్పుకున్నారు. ఈ విషయం గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు. ‘‘చిత్ర పరిశ్రమ నా ఫ్యామిలీలాంటిది. అందుకే దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదు. కానీ, ఒక విషయంలో స్పష్టత ఇవ్వక తప్పడం లేదు. నా 33ఏళ్ల కెరీర్‌లో ఎప్పుడూ ఇలా వివరణ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఇదే మొదటిసారి. అనిల్‌రావిపూడి-మహేశ్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా నుంచి నేను తప్పుకొన్నానని సోషల్‌మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి. అందులో నిజం లేదు. ఇప్పటికీ ఆ పాత్ర నాకు బాగా నచ్చింది. చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ సినిమా కోసం మరో రెండు సినిమాలు వదులుకోవడం కూడా నిజం. కానీ, ఇండస్ట్రీలో కొన్ని కారణాల వల్ల ఇంకొన్ని విషయాలు జరుగుతాయి. తప్పవు. ఆ పరిస్థితి వల్ల సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ సినిమాను, పాత్రను మిస్‌ అవుతున్నా. ఏదేమైనా చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌’’ అని జగపతిబాబు ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ‘జగపతి బాబు గారికి ‘సరిలేరు నీకెవ్వరు’లోని క్యారెక్టర్‌ బాగా నచ్చింది. కానీ అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుంచి తొలగించాల్సి వచ్చింది. అర్థం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు జగపతి బాబు గారు. మీతో పనిచేసేందుకు ఎదురుచూస్తుంటా’నని దర్శకుడు అనిల్‌ రావిపూడి స్పందించారు. మరి ఆ స్థానంలో ఎవరు నటిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.