బాలయ్య నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్‌..

నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల కలయికకు చిత్రసీమలో మంచి క్రేజ్‌ ఉంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలు నందమూరి అభిమానులతో పాటు సినీప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు చిత్రాల్లోనూ బాలయ్యను ఎంతో కొత్తగా చూపించారు బోయపాటి. ఇప్పుడీ జోడీ నుంచి ముచ్చటగా మూడో చిత్రం పట్టాలెక్కబోతుంది. తాజాగా ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. వీరి నుంచి వచ్చిన గత చిత్రాల్లాగే ఈ సినిమాలోనూ బాలయ్య రెండు భిన్నమైన గెటప్పుల్లో దర్శనమివ్వనున్నారట. ఇది బాలకృష్ణకు 106వ చిత్రం. ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇక బాలయ్యకు జోడీగా ఎవరు నటిస్తారు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారట. దీన్ని ద్వారకా ప్రొడక్షన్స్‌ పతాకంపై మిరియాల రవీంద్ర రెడ్డి నిర్మించనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.