‘కేజీఎఫ్‌ 2’లో నటిస్తారా? రండి.. ఛాన్స్‌ మీదే

కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్‌’. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్‌ ఎంటర్‌టైనర్‌లో యశ్‌ కథానాయకుడిగా నటించారు. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2’ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్‌. ప్రస్తుతం ఈ సినిమా కోసం నూతన నటీనటులను ఆహ్వానం పలుకుతోంది చిత్ర బృందం. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను విడుదల చేశారు. 8 నుంచి 16 సంవత్సరాల వయసున్న పిల్లలతో పాటు 25 ఏళ్ల వయసు పైబడిన పురుషులు కావాలంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఆడిషన్స్‌కు వచ్చే ముందు నిమిషం పాటు ఉన్న ఏదైనా డైలాగ్‌ను నేర్చుకోని రావాలని చిత్ర బృందం సూచించింది. ఇక ఆడిషన్స్‌ జరిగే ప్రాంతం, ఇంకా ఇతర వివరాలను పోస్టర్‌లో పేర్కొన్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతుండగా.. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 




Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.