చిరు 152’.. ఆ వార్తలు అవాస్తవం!

‘సైరా’ వంటి విజయం తర్వాత చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. చిరు 152వ చిత్రంగా సెట్స్‌పై ముస్తాబవుతోన్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాణ విషయంలో కొన్ని మీడియాల్లో ఊహాగాన వార్తలొచ్చాయి. ఈ చిత్రానికి చరణ్‌ కేవలం నామమాత్రపు నిర్మాత మాత్రమే అని.. డబ్బు పెట్టకుండా లాభాల్లో వాటా తీసుకోబోతున్నారని ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలోనే మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘రామ్‌చరణ్‌కు సంబంధించిన కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ, చరణ్‌ మా సంస్థలో నిర్మిస్తున్న ‘చిరంజీవి 152’ చిత్రంలో పూర్తి భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు, ఇతర ప్రొడక్షన్‌ విషయాలు అన్నింటిలో మ్యాట్నీతో కలిసి సమాన భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నారు. మా రెండు సంస్థలు కలిసే పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఎవరెలాంటి బాధ్యతలు తీసుకోవాలి, ఏ వ్యవహారాలు చూసుకోవాలి అనే విషయంలో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. దాని ప్రకారమే ఈ చిత్ర నిర్మాణం జరుగుతుంది’’ అని ఆ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌. తాజాగా ఈ చిత్రంలో చిరుకు జోడీగా కాజల్‌ అగర్వాల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.