కరోనా కట్టడికి చిత్ర పరిశ్రమ సాయం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ మహమ్మారి కట్టడికి కృషి చేస్తోన్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పలువురు ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. ఇటీవలే యువ కథానాయకుడు నితిన్‌ తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే. గురువారం ఇతర కథానాయకులు, దర్శకులు, నిర్మాతలు ముందుకొచ్చారు.

*పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వానికి రూ.కోటి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షలు, ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి రూ.50 లక్షలు ప్రకటించారు. మహేష్‌ బాబు ఏపీ, తెలంగాణకు ప్రభుత్వాలకు చెరో రూ.50లక్షల చొప్పున విరాళం ఇచ్చారు. సినీ కార్మికుల కోసం చిరంజీవి రూ.కోటి ఇస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు. ప్రభాస్‌ కరోనాని అరికట్టేందుకు ముందుకు వచ్చారు. ఆయన రూ.కోటి విరాళం ప్రకటించారు. రామ్‌ చరణ్‌ కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రూ.70 ఆర్థిక సాయం అందించారు. సాయి ధరమ్‌ తేజ్‌ రూ. 10లక్షలు ఇచ్చారు. తన సినిమా కోసం పనిచేస్తున్న 50 మంది కార్మికులకు అల్లరి నరేశ్‌ ఒక్కొక్కరికి రూ.10వేలు సాయం చేశారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.75 లక్షల సాయం అందించారు. రెండు  తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు, సినిమా పరిశ్రమ కార్మికులకు రూ.25 లక్షల చొప్పున సాయం చేశారు.
దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తనవంతు సాయంగా తెలంగాణకు రూ.10 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.10 లక్షలు విరాళం ఇచ్చారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలంగాణ రాష్ట్రానికి రూ.5 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.5 లక్షలు విరాళం కింద అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు కొరటాల శివ సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలను విరాళంగా ఇస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ తరఫున దిల్‌రాజు, శిరీష్‌.. కరోనా నివారణకు రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.20 లక్షల సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 లక్షలను విరాళంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.