అమ్మతోడు.. 15న పక్కా అట!!

‘‘విజయ్‌ ఓ చెడ్డ విద్యార్థిలా మమ్మల్ని మా పని చేసుకోన్విట్లేదని’’ సరదాగా అభిమానుల ముందు తన గోడు వెల్లబోసుకున్నాడు దర్శకుడు భరత్‌ కమ్మా. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. విజయ్‌ దేవరకొండ - రష్మిక జంటగా నటించారు. మైత్రీ మూవీస్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సినిమాలోని రెండోవ పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ, తాజాగా దీన్ని వాయిదా వేసినట్లు భరత్‌ కమ్మా ట్వీట్‌ చేశారు. అంతేకాదు దీనికి దేవరకొండే కారణమని చెప్పారు. ‘‘మీరు ఈ పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ప్రతి తరగతిలో ఇతరుల దృష్టిని మళ్లించే ఓ చెడ్డ విద్యార్థి ఉంటాడు. అలాగే విజయ్‌ కూడా మమ్మల్ని మా పని చేసుకోనివ్వలేదు. దీనికి క్షమాపణలు కోరుతున్నా’’ అని ఆయన ట్వీట్‌లో రాసుకొచ్చారు. దీనిపై దేవరకొండ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ‘‘నా పుట్టినరోజున బాగా క్రికెట్‌ ఆడాం. దాంతో బాగా ఒళ్లు నొప్పులొచ్చేశాయ్‌. కూర్చుని పాట విన్నాం.. కానీ, వీడియో కటింగ్‌ పూర్తి చేయలేదు. ఫలితంగానే టీచర్‌ (దర్శకుడు) దృష్టి మారింది. పాటను పక్కాగా మే 15న ఉదయం 11:11 గంటలకు విడుదల చేస్తాం. అమ్మతోడు’’ అని ట్వీట్‌ చేశారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.