కరోనా దెబ్బ: మరో రాష్ట్రంలో థియేటర్లు మూత

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే 4,300 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 101కి పైగా దేశాలకు ఈ వైరస్‌ విస్తరించేసింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించేసింది. ఇక భారత్‌లోనూ ఈ వైరస్‌ అంతకంతకూ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఓ భయాందోళనలు నెలకొని ఉండగా.. దేశంలోని అనేక వ్యాపార రంగాలు కుదేలైపోతున్నాయి. ఇక చిత్రసీమ పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టుల చిత్రీకరణలు నిలిచిపోగా.. విడుదలకు సిద్ధమైన అనేక చిత్రాలు ఒకొక్కటిగా వాయిదా పడుతున్నాయి. ఈ వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఈ నెల 31 వరకు థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడిదే జాబితాలో మరో రాష్ట్రం వచ్చి చేరింది. ప్రస్తుతం దిల్లీలోనూ కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు షురూ చేసింది. ఇందులో భాగంగానే ఈ నెలాఖరు వరకు ఆ రాష్ట్రంలో సినిమా హాళ్లు మూసి వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం దేశంలో కనిపిస్తున్న పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే బాటలో నడవబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాలీవుడ్‌ చిత్రసీమపై తీవ్ర ప్రభావం చూపించనున్నట్లు తెలుస్తోంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.