పుకార్లకు పుల్‌స్టాప్‌ పెట్టిన ‘డిస్కోరాజా’

తమ చిత్రం ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు చెక్‌ పెట్టింది ‘డిస్కోరాజా’ చిత్ర బృందం. రవితేజ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని దర్శకుడు వి.ఐ. ఆనంద్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌ ఓ షెడ్యూల్‌ పూర్తి కాగా.. రెండో షెడ్యూల్‌ మే 27 నుంచి మొదలుకాబోతున్నట్లు మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. కావాలనే రెండో షెడ్యూల్‌ కోసం ఎక్కువ విరామం తీసుకున్నామని, ఈ నేపథ్యంలోనే షూటింగ్‌ ఆగిపోయినట్లు వార్తలొచ్చాయన్నారు. రెండో షెడ్యూల్‌ మే 27 నుంచి జూన్‌ 21 వరకు హైదరాబాద్‌లో కొనసాగనుంది. మాస్‌ రాజా తొలిసారిగా చేస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ కథ ఇది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యముంది. ఈ సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించబోతున్నారు. ఆయనకు జోడీగా ముగ్గురు కథానాయికలు తళుక్కున మెరవబోతున్నారు. ఇందు కోసం నభా నటేశ్, పాయల్‌ రాజ్‌పుత్‌లను ఎంపిక చేసుకోగా.. మరో నాయిక ఎవరన్నది తెలియాల్సి ఉంది. సునీల్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.