‘ఈశ్వరుడు’గా వస్తున్న సింబు

తమిళ నటుడు సింబు హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఈశ్వరన్’‌. సుశీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఫస్టలుక్‌ - మోషన్‌ పోసర్ని చిత్రబృందం ఈ రోజు విడుదల చేసింది. తెలుగులో ‘ఈశ్వరుడు’గా అనువాదం అవుతోంది. మాధవ్‌ మీడియా - బాలాజీ కాప సమర్పణలో డీ కంపెనీ, కేవీ దురై సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విడుదలైన ఫస్ట్ లుక్‌ మోషన్‌ ప్టోసర్లో సింబు పచ్చని పొలాల మధ్యలో లుంగీ ధరించి, మెడలో త్రాచు పామును పట్టుకొని తీక్షణంగా చూస్తున్నాడు. మరో పోస్టర్లో చేతిలో బ్యాట్‌ ధరించి ఉన్నాడు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. తమన్‌ సంగీత స్వరాలు సమకూరుస్తున్న చిత్రం కన్నడ, మలయాళ, హిందీలోనూ విడుదల కానుంది. చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. సింబు చిత్రాలు తమిళంలో పాటు తెలుగులోనూ విడుదలై ఆదరణ పొందుతున్నాయి. ఇప్పటికే ఆయన నటించిన ‘మన్మథ’, ‘వల్లభ’ వంటి చిత్రాలు తెలుగువారిని మెప్పించాయి. ప్రస్తుతం సింబు - వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే చిత్రంలో చేస్తున్నాడు. ఇందులో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్‌ నటిస్తుంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.