‘ఇస్మార్ట్‌..’తో పాతరోజుల్ని గుర్తుచేస్తున్నారుగా..

ఒకప్పుడు ఓ సినిమా హిట్‌ అయిందంటే చాలు.. ఆ చిత్రం వంద రోజులు ఎన్ని థియేటర్లలో ఆడింది? నూటయాభై రోజులు ఎన్ని థియేటర్లలో ఆడింది? అంటూ ఆరాలు తీసేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితులు ఎక్కడా లేవు. పట్టుమని ఓ వారం హౌస్‌ఫుల్‌ పడితే గగనం.. రెండు వారాలు నిలకడగా వసూళ్లు సాధిస్తే అమ్మో అనేంత ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇక సినీప్రియుల ముందు రీ రిలీజ్‌ల పేరెత్తితే.. అది ఎంత హిట్‌ చిత్రమైనా ‘అబ్బో మళ్లీ వస్తుందా’ అన్న నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. దానికి తోడు డిజిటల్‌ ప్లాట్‌ఫాం పుణ్యమాని కొత్తగా వచ్చిన బొమ్మ నెలరోజులకే నెట్టింట సందడి చేస్తుంటే మళ్లీ థియేటర్లోకి వెళ్లి చూడాల్సిన అవసరం ఎవరికొస్తోంది. అందుకే దర్శక,నిర్మాతలు సైతం ఈ రీ-రిలీజ్‌ అన్న మాటను ఎప్పుడో చరిత్ర పుటల్లో వదిలేశారు. అయితే తాజాగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ రీ-రిలీజ్‌ పేరుతో వార్తల్లో నిలిచి మరోసారి పాత రోజుల్ని గుర్తు చేసింది. ఎనర్జిటిక్‌ హీరో రామ్‌.. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ల కలయికలో వచ్చిన ఈ పవర్‌ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ ఇటీవలే విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.80 కోట్ల వసూళ్లను రాబట్టి చాలా కాలం తర్వాత పూరికి అదిరిపోయే హిట్‌ను ఇచ్చింది. అయితే ఇప్పుడీ చిత్రాన్ని మరోసారి రీ-రిలీజ్‌ చేయబోతోంది చిత్ర బృందం. తాజాగా పూరి జగన్నాథ్‌ పుట్టినరోజును పురస్కరించుకోని ఈ సర్‌ప్రైజ్‌ విషయాన్ని అభిమానులతో పంచుకుంది ఛార్మి. ఆమె పూరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రీ-రిలీజ్‌ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా నిర్దేశించిన కొన్ని థియేటర్లలో మాత్రమే ఉండనుందట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏయే థియేటర్లలో ఇస్మార్ట్‌ను ప్రదర్శించబోయేది ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేసింది. మరి ఈ పనితో ఇస్మార్ట్‌కు మరోసారి లాభాల వర్షం కురుస్తుందా? లేదా? అన్నది పక్కకు పెడితే చాలా కాలం తర్వాత టాలీవుడ్‌లో పాత రోజుల్ని గుర్తు చేసింది ఇస్మార్ట్‌ బృందం. ఒకవేళ ఈ చిత్రానికి రీ-రిలీజ్‌లో మంచి వసూళ్లు దక్కితే ముందు ముందు మరిన్ని చిత్రాలు ఈ బాటలో నడిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.