‘రాధేశ్యామ్‌’కి ప్రభాకరన్‌ స్వరాలు

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతోన్న ప్రేమకథ ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ దర్శకుడు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడి వివరాలు రహస్యంగా ఉంచి ఆసక్తి పెంచింది చిత్రబృందం. తాజాగా ఆ సర్‌ప్రైజ్‌ని అందించింది. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకుడని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించింది. తమిళ చిత్రాలకు పనిచేసిన ప్రభాకరన్‌ తెలుగు శ్రోతలకు సుపరిచితుడే. విజయ్‌ దేవరకొండ కథానాయకుడుగా వచ్చిన ‘డియర్‌ కామ్రేడ్‌’కి సంగీతం అందించారు జస్టిన్‌. ఇందులోని అన్ని పాటలు విశేషంగా అలరించాయి. ప్రభాస్‌, ప్రభాకరన్‌ కాంబినేషన్‌లో ఎలాంటి సంగీతం రాబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. జగపతి బాబు, సత్యరాజ్‌, భాగ్యశ్రీ, జయరాం, మురళీ శర్మ ప్రియదర్శి తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కృష్ణం రాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్‌, యువీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్నాయి. ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్‌ 23న మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయనున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.