రూ.కోటి సాయం అందించిన కమల్‌

మల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ‘భారతీయుడు 2’ చిత్ర సెట్లో బుధవారం రాత్రి జరిగిన ప్రమాద ఘటనలో ముగ్గురు సహాయ దర్శకులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మృతుల కుటుంబాలకు కమల్‌ ఆర్థిక సహాయం ప్రకటించారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో లైటింగ్‌ కోసం ఏర్పాట్లు చేస్తోన్న క్రమంలో క్రేన్‌ తెగి ప్రమాదం చోటు చేసుకుంది. దాదాపు 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్‌ తెగి చిత్ర బృందం ఉండే టెంట్‌పై పడటంతో శంకర్‌ వ్యక్తిగత సహాయకులు మధు (29), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సాయికృష్ణ (34), ‘మరో సహాయకుడు చంద్రన్‌ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను కమల్‌ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘సినీ పరిశ్రమలో పనిచేసే వాళ్లకు రక్షణ ఎంత ప్రశ్నార్థకంగా ఉన్నది ఈ ప్రమాదం తెలియజేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకునే విధంగా ఈరోజు ఉదయం నేను పరిశ్రమలోని నా మిత్రులతో మాట్లాడాను. ఎన్నో కోట్ల బడ్జెట్‌తో సినిమాలు నిర్మిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ, సినిమా కోసం పనిచేసే వాళ్లకి సరైన రక్షణ ఇవ్వలేకపోతున్నామని సిగ్గుపడుతున్నాను. నిన్న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా తరపున రూ.కోటి ఆర్థిక సాయం అందిస్తాను. ఇది నష్టపరిహారం కాదు. వాళ్లంతా నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. మూడేళ్ల క్రితం నాకు ప్రమాదం జరిగింది. కుటుంబంలోని కీలకమైన వ్యక్తికి ప్రమాదం జరిగితే ఆ కుటుంబ జీవనం ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు’’ అన్నారు కమల్‌.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.