కూర్చుంటే పోయేదేముంది...!

కరోనాతో సాగుతున్న యుద్ధంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇంట్లో గడుపుతూ ఆ యుద్ధానికి సహకరించాల్సిన జనం మాత్రం, బయటికెళ్లి శత్రువుకి మరింత బలాన్నిస్తున్నారు. ఇది తగదంటూ జనంలో చైతన్యం పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్‌.ఎమ్‌.కీరవాణి ‘ఓ మై డియర్‌ గర్ల్స్, డియర్‌ బాయ్స్‌...’ అంటూ కరోనా నేపథ్యంలో ఓ పాటని రూపొందించారు. ఆ పాట ప్రజలకి జాగ్రత్తలు సూచిస్తూనే, సేవ చేస్తున్న వాళ్లకి కృతజ్ఞతలు చెబుతూ సాగుతోంది. ఆ పాట గురించి కీరవాణి ‘ఈనాడు సినిమా’తో చెప్పిన విషయాలివీ...


లాక్‌డౌన్‌ సమయంలో మీ జీవితం ఎలా గడుస్తోంది?

ఇప్పటిదాకా అయితే బాగానే గడుస్తోంది. నిర్బంధం మూడు వారాలే కదా. బయటికి వెళ్లకూడదంటే వెళ్లకూడదంతే. మూడు వారాలు పని మాని ఇంట్లో కూర్చుంటే పోయేదేముంది? కుటుంబంతో కాలక్షేపం చేస్తే బాగుంటుంది.

‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ పాట బాణీలోనే కరోనా గీతం చేయాలనే ఆలోచన ఎందుకొచ్చింది?

పేషంట్‌ అంటే రెండు అర్థాలున్నాయి. ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న రోగి అని ఒక అర్థం. సహనంతో నిరీక్షించే వ్యక్తి అని మరో అర్థం. సహనం కోల్పోయి బయటికి వెళ్లి తిరిగితే అప్పుడు కరోనా పాజిటివ్‌ వచ్చి ఆ ఇంట్లో పేషంట్‌ నెంబర్‌ 1 అనిపించుకుంటారు. అదే ఇళ్లల్లోనే ఉంటూ ఈ పరీక్షలో నెగ్గారనుకోండి. అప్పుడూ పేషంట్‌ నెంబర్‌ 1 అంటారు. మీరు ఏ రకమైన నెంబర్‌ 1 కావాలనుకుంటున్నారు? ఈ ఆలోచన రాగానే నాకు ‘స్టూడెంట్‌ నెంబర్‌ 1’ గుర్తుకొచ్చింది. అందులో బాణీనే తీసుకొని ఈపాట తయారు చేశా.

కరోనా రోగుల సంఖ్య పెరిగేకొద్దీ జనాల్లో భయం పెరుగుతోంది. దాని గురించి మీరేం చెబుతారు?

భయం ఎందుకండీ? 1991లో హెపటైటిస్‌-బి వచ్చినప్పుడు లక్షల్లో చనిపోయారని నాకు శాంతా బయోటెక్‌ వరప్రసాద్‌రెడ్డి గారు చెప్పారు. కాకపోతే అప్పట్లో మీడియా ఇంతగా లేదు. మిగతా దేశాలతో పోలిస్తే కరోనాతో మన దేశంలో తక్కువ మందే పోయారు. మరింత అవగాహనతో ఇంట్లోనే కూర్చుని, కరోనా వ్యాప్తిని అరికడితే ఈ నష్టం ఉండదు. ప్రపంచంలోనే మనది ఉత్తమ దేశం అని గుర్తించడానికి గొప్ప అవకాశం ఇది.

కరోనా లాంటి వైపరీత్యాలు మనిషిలోని స్వార్థంతోనే వస్తాయంటారా?

పెరుగుట విరుగుట కొరకే అని మాత్రమే నేను అంటాను. ఇవి ఎందుకు జరుగుతున్నాయో చెప్పాల్సింది వైద్యులు, శాస్త్రవేత్తలు. వాళ్లు చెబుతూనే ఉన్నారు. మనం పట్టించుకోం కాబట్టి ఇలా ఒకేసారి అన్నీ మీదకొస్తాయి. కరోనా తగ్గిపోయినా దేశంలో అందరూ చేతులు కడుక్కోవల్సిందే. రోజూ స్నానంలాగే చేతులు శుభ్రం చేసుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి. కరోనా లేదంటే మరో వైరస్‌ ఏదో ఉంటుంది కదా.

ఈ విరామంలో ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయా?

ఇప్పుడు ఆ పనులేమీ జరగడం లేదు. ఇటీవల విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు వీడియోకు ఎన్టీఆర్‌తో ఆన్‌లైన్‌లో డబ్బింగ్‌ చెప్పించాం. ఎన్టీఆర్‌ డైలాగ్‌ డెలివరీ బాగుంటుంది. దాన్ని ఉపయోగించుకోవచ్చని రాజమౌళి ఆయనతోనే నాలుగు భాషల్లో డబ్బింగ్‌ చెప్పించారు.

’’సోషల్‌ డిస్టెన్సింగ్‌ అంటారు కానీ... మనం ఇంట్లో కూర్చునే సామాజికంగా ఇంకా దగ్గరగా ఉండొచ్చు. బోలెడు సమయం దొరికింది కాబట్టి ఎవరికైనా ఫోన్‌ చేసి మాట్లాడొచ్చు. అది సోషల్‌గా దగ్గరగా ఉండడమే. ఎప్పట్నుంచో సారీ చెప్పాలి, థ్యాంక్స్‌ చెప్పాలి, ఇంకేదో అడగాలనే ఆలోచనలో ఉంటాం. అవన్నీ ఇప్పుడు ఫోన్‌లో చేయొచ్చు. ఫోన్‌లో వీడియో కాల్‌ చేసి మాట్లాడుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలతో ఇప్పటి వరకు చేయని పనులు చక్కబెట్టుకోవచ్చు’’.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.