జాతీయ ఉత్తమ నటిగా కీర్తి సురేష్‌

కీర్తి సురేష్‌..రామ్ కథానాయకుడుగా ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తన నటనతో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత నానితో కలిసి ‘నేను లోకల్‌’ సినిమాలో నటించింది. ఈ రెండు ప్రేమకథలతో యువతను ఆకర్షించిన ఈ నటి పవన్‌ కల్యాణ్‌కు జోడిగా ‘అ‍జాతవాసి’లో మెరిసింది. సావిత్రి బయెపిక్‌ తెరకెక్కబోతోందన్న విషయం తెలియగానే అలాంటి పాత్రను ఎవరు పోషించగలరు? ఎవరైతే న్యాయం చేయగలరు? అనే సందేహం అటు సినీ పరిశ్రమలో.. ఇటు అభిమానుల్లో కలిగింది. చివరకు ఆ పాత్ర కీర్తి సురేష్‌కు దక్కిన విషయం తెలిసిందే. ఆమె అద్భుత నటనతో సావిత్రే మళ్లీ నటించిందా అనేలా జీవించింది కీర్తి. విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపించేలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. అందుకే కీర్తికి జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. ఇందులో భాగంగా నటి కీర్తి సురేష్‌ జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది.


 ‘‘మహానటి’ని వద్దనుకున్నా’’.. - కీర్తి సురేష్‌
‘‘మహానటి’ ప్రభావం నాపై ఎప్పటికీ ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం... ఇలా ఎక్కడికి వెళ్లినా ‘మహానటి’ గురించే మాట్లాడుతుంటారు. మొదట నా దగ్గరికి అవకాశం వచ్చినప్పుడు చేయనని చెప్పాలనుకొన్నా. సావిత్రిలా నేను కనిపిస్తానో లేదో, అలా చేయగలనో లేదో అని భయపడ్డా. ఒక మంచి సినిమా తర్వాత కథానాయికకి యువతరంలో క్రేజ్‌ పెరగడం సహజం. కానీ ‘మహానటి’ తర్వాత పెద్దవాళ్లు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. గుంటూరు వెళ్లినప్పుడు ఓ పెద్దాయన వచ్చి ‘మీరు సావిత్రిగారే కదా?’ అని అడిగారు. ‘నేను సావిత్రిగారిని కాదండీ, అలా నటించాను’ అని చెప్పా. ‘లేదు లేదు మీరు సావిత్రిగారే’ అన్నారు’ అని ఓ సందర్భంలో కీర్తి సురేశ్‌ చెప్పుకొచ్చారు.ఈ అవార్డు అమ్మకు అంకితం..
"చాలా సంతోషంగా ఉంది. ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు. వారు లేకుండా ఈ ఘనత సాధ్యం కాదు. ఇది నా జీవితంలో అత్యుత్తమ అనుభూతి. అమ్మ మేనకకు తొలి మలయాళం సినిమాకు జాతీయ అవార్డు రావాల్సింది. కానీ కొద్దిలో చేజారిపోయింది. అందుకే ఈ పురస్కారాన్ని ఆమెకు అంకితం ఇస్తున్నా".

 -కీర్తి సురేశ్, జాతీయ ఉత్తమ నటి, హీరోయిన్
సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.