మరో క్రేజీ ప్రాజెక్టుతో ‘మహానటి’ దర్శకుడు

రెండో సినిమాతోనే ప్రేక్షకులను, చిత్ర పరిశ్రమ పెద్దలను తన వైపు తిప్పుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ‘మహానటి’ సావిత్రి జీవిత గాథను తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో ఆయన తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకు ఈ టాలెంటెడ్‌ దర్శకుడు ఏం చేస్తున్నాడనే విషయంపై సందేహం ఉండేది. తాజాగా వచ్చిన ఓ అప్‌డేట్‌ ఆయన వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌లో సినిమా తీయబోతున్నాడని ఖరారు చేసింది. అదేంటంటే.. ‘మేము భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నాం. కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాం. విజువల్‌ ఆర్టిస్ట్స్,డిజైనర్స్, రచయితలు ఈ ప్రయత్నంలో భాగస్వాములు కావాలంటే సంబంధిత చిరునామాకు వివరాలు తెలియజేయాలం’టూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ చేసింది వైజయంతీ మూవీస్‌ సంస్థ. ఇందులో ఏ ఫిల్మ్‌ బై నాగ్‌ అశ్విన్‌ అనే ట్యాగ్‌ ఉండటంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబరులో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. దీంతో ఇప్పుడు హీరో,హీరోయిన్లు ఎవరు? టైటిల్‌ ఏంటి? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.