‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఆపాల్సిందే :సెన్సార్‌ బోర్డు

నందమూరి తారక రామారావు రాజకీయ జీవితంలో తుది దశలో జరిగిన అనేక కీలక పరిణామాలను ఆధారంగా చేసుకోని రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’, ఈ చిత్రంతో లక్ష్మీ పార్వతి జీవిత కోణం నుంచి ఎన్టీఆర్‌ జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమా మార్చి 22న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని ఆదేశిస్తూ సెన్సార్‌ బోర్డు ఆదేశించింది. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల చేయడం సబబు కాదని తెదేపా కార్యకర్త దేవిబాబు చౌదరి ఇటీవలే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో సినిమాను ప్రస్తుతానికి నిలిపివేయాలంటూ సెన్సార్‌బోర్డు చిత్రబృందాన్ని ఆదేశించింది. ఏపీలో ఎన్నికలు పూర్తయిన తర్వాత సినిమాను విడుదల చేసుకోవచ్చని సూచించింది. దీనిపై వర్మ ట్విటర్‌ ద్వారా స్పందించారు. సెన్సార్‌ బోర్డుపై కేసు పెడతానని, సినిమా విడుదల కోసం న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. త్వరలో కడపలో ఓ బహిరంగ సభలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ ఆడియో వేడుకను నిర్వహించనున్నట్లు వర్మ శనివారం వెల్లడించారు.






Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.