ఆస్కార్ అవార్డు... సినిమా నటులకు అది అంబరం. ప్రేక్షకులకు పెద్ద సంబరం. ఆ సంబరం వచ్చే ఏడాది జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో కమిటీ ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. సాధారణంగా ఆస్కార్ పురస్కార వేడుక ఏటా ఫిబ్రవరి రెండో ఆదివారం నిర్వహిస్తారు. ఈసారి అందుకు అనుకూలంగా పరిస్థితులు లేకపోవడంతో ఈ వేడుకను ఏప్రిల్ 25, 2021 నాటికి వాయిదా వేశారు. అప్పటికైనా పరిస్థితులు చక్కబడకపోతే..వర్చువల్‌గా అవార్డులు ఇస్తారని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కమిటీ స్పందించింది. అప్పటికి పరిస్థితులు తప్పకుండా కుదుట పడతాయని, కచ్చితంగా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లలోనే వేడుకలు నిర్వహించనున్నామని స్పష్టం చేసింది. థియేటర్లు తెరుచుకొని, మరికొన్ని మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తాయని, వాటిలోంచి కూడా పోటీకి తీసుకుంటామని తెలియజెప్పింది. భారతదేశం నుంచి మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ ఆస్కార్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. షార్ట్ లిస్ట్‌ను 2021 ఫిబ్రవరి 9న ప్రకటించనున్నారు. నామినేషన్లను మార్చి 15న చెబుతారు. అవార్డుల వేడుకను ఏప్రిల్ 25న నిర్వహించన్నారు.