పవన్‌ రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు

పవర్‌స్టార్‌ సినిమాలకు దూరమై పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారు. తాను ఇకపై సినిమాలు చేయనని, పూర్తిగా ప్రజా సేవకే అంకితమవుతానని క్లారిటీ ఇచ్చారు. కానీ, ఇప్పటికీ ఆయన చిత్రసీమ రీ ఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ముగియడంతో ఈ ఏడాది చివరి నాటికి పవన్‌ తిరిగి ముఖానికి రంగేసుకుంటాడని, రెండేళ్లకు ఒక సినిమాతోనైనా తెరపై సందడి చేస్తాడని సినీప్రియులు ఆశించారు. దీనికి తోడు మైత్రీ మూవీస్‌ నుంచి పవర్‌స్టార్‌ తీసుకున్న అడ్వాన్సును ఇంకా వెనక్కు ఇవ్వకపోవడం కూడా రీఎంట్రీపై వస్తున్న వార్తలకు బలం చేకూర్చాయి. అయితే తాజాగా ఈ అంశంపై ఆయన సోదరుడు నాగబాబు క్లారిటీ ఇచ్చారు. ‘‘పవన్‌ సినిమాలు చేయనని గతంలోనే చెప్పాడు కదా. ఎన్టీఆర్, జమున, చిరంజీవి వంటి వారు రాజకీయ ప్రవేశం తర్వాత కూడా సినిమాలు చేశారు కాబట్టి.. కల్యాణ్‌ కూడా అలా చేయాలని రూల్‌ ఏం లేదు కదా. పవన్‌ మళ్లీ సినిమాలు చేస్తాడంటూ కొందరు ఆయన్ను ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్నారు. ఇలాంటి వారందరికీ నేను చెప్పేదొకటే. మీరు కల్యాణ్‌ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఎవరైనా తనను అణగదొక్కొలని చూస్తే.. అంతకు 100 రెట్లు పైకి లేస్తాడు. ఎవరైనా ఆయన్ను విమర్శిస్తే అది కల్యాణ్‌కే ప్లస్‌ అవుతుంది తప్ప వేరొకటి కాద’’న్నారు. ఏదేమైనా ఇప్పుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలను బట్టీ చూస్తుంటే పవర్‌స్టార్‌ రీ ఎంట్రీ ఉండదేమోనని అనిపిస్తోంది. మరి ఎన్నికల ఫలితాలను బట్టీ పవన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.