పవన్ కల్యాణ్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అంటే అదో అద్భుతం. ఈ ఇద్దరి కాంబినేషన్ అనగానే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది ప్రేక్షకులకు. ‘జల్సా’, ‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాలే దానికి నిదర్శనం. మళ్లీ ఎప్పుడెప్పుడు కలిసి పనిచేస్తారని అటు పవన్ అభిమానులు, ఇటు డీఎస్పీ అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. ఇటీవలే దర్శకుడు హరీశ్ శంకర్.. పవన్‌తో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో పవన్ హీరోగా హరీశ్ దర్శకత్వంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’కి దేవీనే సంగీతం అందించాడు. ఆ ఆల్బమ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం విడుదలై 8 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు హరీశ్. తాను త్వరలో పవన్‌తో తెరకెక్కించబోయే ‘పవన్ 28’కి దేవీనే సంగీత దర్శకుడు అని సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు.