‘పింక్‌’ నుంచి ఓ శుభవార్త

పవన్‌ కల్యాణ్‌ రీఎంట్రీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌ కోసం సినీప్రియులంతా ఎంత ఆతృతతో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శరవేగంగా సెట్స్‌పై ముస్తాబవుతోన్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 15న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక చిత్ర విడుదలకు మరో రెండు నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. సంగీత దర్శకుడు తమన్ స్వరాలు సిద్ధం చేసే పనిలో బిజీ అయిపోయారు. ఇందులో భాగంగానే తాజాగా ఆయన ఓ శుభవార్త వినిపించారు. ఈ చిత్రం కోసం ఓ స్టార్‌ సింగర్‌ను రంగంలోకి దించుతున్నట్లు ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఇంతకీ ఆయన మరెవరో కాదు.. తాజా యువ సంగీత సంచలనం సిద్‌ శ్రీరామ్. గతేడాది ‘సామజవరగమన’ అంటూ సినీ సంగీత ప్రియుల్ని తన గాత్రంతో ఉర్రూతలూగించిన ఈ యువ కెరటం.. ఇప్పుడు ‘పింక్‌’ రీమేక్‌లో ఓ గీతాన్ని ఆలపించబోతున్నట్లు తమన్‌ ట్విటర్‌లో తెలియజేశారు. ఈ పాటకు ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ‘వకీల్‌ సాబ్‌’ అనే టైటిల్‌ను పరిశీలిస్తోంది చిత్ర బృందం. ఉగాది కానుకగా చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.