‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఉపాధ్యక్ష పదవికి సినీ నటుడు రాజశేఖర్‌ రాజీనామా చేశారు. గురువారం 'మా' నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం రసాభాస అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి మాట్లాడిన అనంతరం మైక్‌ తీసుకుని రాజశేఖర్‌ ఆవేశంతో ప్రసంగించారు. 'మా'లో గొడవలున్నాయంటూ మరోసారి ప్రస్తావించారు. దీంతో స్టేజ్‌పై ఉన్న చిరంజీవి, మోహన్‌బాబుతోపాటు ఇతర నటీనటులు తీవ్ర అసహనానికి గురయ్యారు. 'మార్చిలో 'మా' కొత్త కార్యవర్గం ప్రారంభమైన నాటి నుంచి తాను ఒక్క సినిమా కూడా చేయలేదని అసోసియేషన్‌ కోసం తాను కష్టపడుతున్నానని అన్నారు. అందరం కలిసే నడవాలని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారన్న రాజశేఖర్ నిప్పును కప్పిపుచ్చితే పొగ వస్తుందన్నారు.'మా'లో గొడవలున్నాయని, రియల్‌ లైఫ్‌లో హీరోగా పనిచేస్తుంటే తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. రాజశేఖర్‌ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి వెంటనే ఖండించారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని 'మా'ను కోరారు. అనంతరం కొద్దిసేపటికి రాజశేఖర్‌ సతీమణి జీవిత కలగజేసుకుని, జరిగిన దానికి క్షమాపణ చెప్పారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న వరుస పరిణామాలకు మనస్థాపానికి గురైన రాజశేఖర్‌ 'మా' వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేశారు.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.