‘ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి రానని చెప్పాను. నా నిర్ణయాన్ని మార్చుకోమని నాపై ఒత్తిడి చేయవద్దు’ అని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను కోరారు. రాజకీయాల్లోకి రాలేనని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయ అరంగేట్రంపై రజనీ వెనక్కి తగ్గడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో తలైవా రావాల్సిందేనంటూ ఆదివారం చెన్నైలో ధర్నా చేపట్టారు. దీనిపై నేడు స్పందించిన రజనీ.. ట్విటర్ వేదికగా అభిమానులకు భావోద్వేగ లేఖ రాశారు.
‘రాజకీయాల్లోకి రాలేకపోవడానికి గల కారణాలను నేను సవివరంగా చెప్పాను. ఆ తర్వాతే నా నిర్ణయాన్ని వెల్లడించా. ఇప్పుడు ఇలాంటి ఆందోళనలు చేసి నన్ను బాధపెట్టొద్దు. నా నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ ఒత్తిడి చేయొద్దు. అభిమానుల ప్రవర్తనతో నేను తీవ్రంగా కలత చెందాను. నన్ను అర్థం చేసుకుని ఇలాంటి ఆందోళనలు చేయకండి’ అని రజనీ లేఖలో కోరారు.
ఆరోగ్య కారణాల దృష్ట్యా కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు రాజకీయాల్లోకి రాలేనని గత నెల 29న రజనీ తన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తలైవా రాక కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో రజనీ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతూ నిన్న చెన్నైలోని వళ్లువర్కోట్టం ప్రాంతంలో ఆయన అభిమానులు ధర్నా చేపట్టారు. రాజకీయ మార్పు, ప్రభుత్వ మార్పు ఇప్పుడు జరగకపోతే ఎప్పుడూ జరగదని పేర్కొన్న రజనీ వ్యాఖ్యలను నినాదాలుగా చేస్తూ తలైవా తన మనసు మార్చుకోవాలని కోరారు. దీంతో రజనీ స్పందిస్తూ అభిమానులకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు డిసెంబరు తొలివారంలో ‘మార్పు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ జరగదు’ అంటూ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు తలైవా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత పార్టీ పేరు ప్రకటించడానికి కొద్ది రోజులు ముందు రజనీ అస్వస్థతకు గురయ్యారు. బీపీ హెచ్చుతగ్గుదలతో హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. దీంతో ఆందోళనకు గురైన ఆయన కుటుంబసభ్యులు రాజకీయ ఆలోచనను విరమించుకోవాలని రజనీని కోరారు.