సూపర్‌స్టార్‌ పోలీస్‌ ‘దర్బార్‌’ షురూ..

‘2.ఓ’, ‘పేట’ వంటి వరుస హిట్లతో ఫుల్‌ జోష్‌లోకి వచ్చారు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఇప్పుడీ ఉత్సాహంలోనే తన 167వ చిత్రాన్ని షురూ చేసేశారాయన. ఏ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి ‘దర్బార్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర బృందం. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో రజనీ నల్లటి చలువ కళ్లద్దాలు పెట్టుకోని స్టైలిష్‌గా నవ్వుతూ కనిపించారు. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో తలైవా ఓ పవర్‌ఫుల్‌ ఐపీఎస్‌ అధికారిగా కనిపించబోతున్నారు. దీనికి తగ్గట్లుగానే పోస్టర్‌లో రజనీకి వెనుక స్నిఫెర్‌ డాగ్, రైఫిల్స్, పోలీస్‌ బెల్టు, బేడీలు, గేట్‌ వే ఆఫ్‌ ఇండియా తదితర చిత్రాలను చూపించారు. ‘‘నన్ను మంచి వాడిగా చూడాలనుకుంటున్నారో, లేదంటే చెడ్డవాడిగా, దుర్మార్గుడిగా చూడాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి’’ అనే ఓ ఆసక్తికర వ్యాఖ్యను కూడా పోస్టర్‌పై రాశారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్‌ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించబోతుంది. ఇందులో రజనీకి జోడీగా నయనతార కనిపించబోతుండగా.. ప్రతినాయకుడిగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.జె.సూర్య నటించబోతున్నట్లు సమాచారం. బుధవారం నుంచి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతుంది.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.