‘కేసీఆర్‌’ను తెరపైకి దించబోతున్న వర్మ

‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రామ్‌గోపాల్‌ వర్మ.. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించబోతున్నారు. తాజాగా ఈ జీవితగాథకు సంబంధించిన టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు వర్మ. దీనికి ‘టైగర్‌ కేసీఆర్‌’ అనే పేరును ఖరారు చేశారు. టైటిల్‌ లోగో కింద.. ‘‘ఆడు తెలంగాణ తెస్తానంటే.. అందరూ నవిండ్రు’’ అంటూ కేసీఆర్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో పాటు ‘ది అగ్రెస్సివ్‌ గాంధీ’ అనే ట్యాగ్‌లైన్‌ను పెట్టడం మరో విశేషం. ఆంధ్ర ప్రజలు తెలంగాణ వాసులను తక్కువ చేసి చూడడం తట్టుకోలేక కేసీఆర్‌ ఏం చేశారన్న నేపథ్యంతో సినిమా రూపొందించబోతున్నట్లు ట్విట్‌లో ప్రకటించారు వర్మ. ప్రస్తుతం ఈయన ‘కోబ్రా’ అనే చిత్రంతో తొలిసారి నటుడిగా తెరకు పరిచయం కాబోతున్నారు. దర్శకుడు అగస్త్య మంజుతో కలిసి వర్మ దీన్ని రూపొందించబోతుండటం విశేషం. భారత నేర చరిత్రలోనే ఎవరూ గుర్తించని అత్యంత ప్రమాదకరమైన నేరస్థుడి జీవితకథతో దీన్ని తెరకెక్కిస్తున్నారు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.