‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అలాంటి చిత్రం కాదు!!

రామ్‌చరణ్, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల జీవితాల ఆధారంగా అల్లుకున్న ఓ ఫిక్షనల్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో భీమ్‌ పాత్రను తారక్‌ పోషిస్తుండగా.. అల్లూరి పాత్రలో చరణ్‌ దర్శనమివ్వబోతున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. తాజాగా ఈ చిత్రం టైటిల్‌ లోగోతో తయారు చేసిన ఒక నాణెం లాంటి లుక్‌ను చిత్ర బృందం ట్విటర్‌ వేదికగా పంచుకుంది. దీంట్లో భీమ్‌.. అల్లూరి ఏదో గొప్ప పనికోసం చేతులు కలిపినట్లుగా చూపించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్‌ ‘‘ఈ చిత్రం.. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కలిసి స్వాతంత్య్రం కోసం పోరాడారని చెబుతుందా?’’ అని ప్రశ్నించగా.. అసలిది దేశభక్తి చిత్రం కాదని చెప్పి ఆశ్చర్యపరిచింది చిత్ర బృందం. ‘‘భీమ్‌.. అల్లూరి కలుస్తారు. వాళ్లిద్దరూ చేతులు కలుపుతారు. కానీ, మీరన్నట్లు వాళ్లు సినిమాలో స్వాతంత్య్రం కోసం పోరాడరు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పూర్తిగా కల్పితమైనది. దేశభక్తి చిత్రం కాదని’’ ఆ నెటిజన్‌కు బదులిచ్చింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.