అందుకే అజయ్‌ని చూపించలేకపోయాం!

ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం నుంచి సరికొత్త అప్‌డేట్‌ను ఇవ్వాలనుకున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేదని చిత్రబృందం వెల్లడించింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. అయితే గురువారం అజయ్‌ దేవ్‌గణ్‌ పుట్టినరోజు సందర్భంగా.. సినిమాలోని ఆయన పాత్ర గురించి తెలియజేసే విధంగా ఓ విజువల్‌ ట్రీట్‌ను అభిమానులకు అందించాలని 'ఆర్ఆర్‌ఆర్‌' టీం భావించిందట. కాకపోతే లాక్‌డౌన్‌ కారణంగా పనులు నిలిచిపోవడంతో అది జరగలేదని చిత్రబృందం ట్వీట్‌ చేసింది.


''మంచి మనసు గల అజయ్‌ దేవ్‌గణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో మీరు కూడా ఒక భాగమవడం మేము గౌరవంగా భావిస్తున్నాం. మొదటి షెడ్యూల్‌లో మీతో కలిసి పనిచేయడం మాకు ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతినిచ్చింది. మీరు కూడా అలాగే భావిస్తున్నారని ఆశిస్తున్నాం. ఈ ఏడాది మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం. 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌ పాత్రను తెలియజేసే విధంగా ఆయన పుట్టినరోజున ఓ వీడియో, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయాలని భావించాం. ప్రస్తుత పరిస్థితుల కారణంగా సంగీతం, ఇంకా కొన్ని పనులు పూర్తి కాలేదు. లాక్‌డౌన్‌ పూర్తికాగానే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌తో మీతో టచ్‌లో ఉంటాం.' అని ఆర్‌ఆర్‌ఆర్‌ టీం ట్వీట్‌ చేసింది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.