తెలుగు తెరపై సరికొత్త ప్రయోగమిది
నవతరం దర్శకుల రాకతో గతకొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమలో వైవిధ్యభరిత కథా చిత్రాల జోరు బాగా పెరిగింది. వినూత్నమైన కాన్సెప్టులతో తెలుగు తెరకు సరికొత్త సొబగులు అద్దుతున్నారు. ఫలితంగా సినీప్రియుల అభిరుచుల్లోనూ మార్పు మొదలైంది. కథ కథనాలు ఆకట్టుకునేలా ఉండాలే కానీ, అది చిన్న చిత్రమా పెద్ద చిత్రామా అని పట్టించుకోకుండా థియేటర్లకు వచ్చి వాలిపోతున్నారు ప్రేక్షకులు. ఈ ఏడాది బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని దక్కించుకున్న ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘ఎవరు’, ‘మత్తువదలరా’ వంటివి ఈ పంథా నుంచి వచ్చినవే. ఇప్పుడీ జాబితాలో చేరేందుకు మరో కొత్త చిత్రం ముస్తాబవుతోంది. 


అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన స్కైలాబ్‌ సెంటర్‌ నేపథ్యాన్ని కథాంశంగా చేసుకోని కెఎఫ్‌సి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఓ క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది. నిత్యమేనన్‌, సత్యదేవ్‌, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించబోయే ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన ప్రకటనను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. విశ్వక్‌ కందెరావ్‌ అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెలుగు తెరపైకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటి వరకు తెలుగులో చూడని ఓ సరికొత్త సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో పీరియాడిక్‌ డ్రామాగా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నాసా సంస్థ ప్రయోగించిన స్కైల్యాబ్‌ 1979ల్లో ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కాలం చెల్లిన ఆ అంతరిక్ష పరిశోధన సెంటర్‌ ఎప్పుడు ఏ దేశంపై పడిపోతుందోనని నాటి ప్రజలంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకోని కాలం వెళ్లదీశారు. ఇప్పుడీ చిత్రాన్ని నాటి ఆ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నారు. ‘అర్జున్‌రెడ్డి’, ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి హిట్ల తర్వాత కెఎఫ్‌సి నిర్మాణ సంస్థ నుంచి వస్తోన్న చిత్రం కావడంతో ఇప్పటికే దీనిపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. త్వరలోనే చిత్ర టైటిల్‌, ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారట.

సంబంధిత వ్యాసాలు


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.