అవార్డు కొట్టిన ‘డియర్‌ కామ్రేడ్‌’..

క్రీడా రంగంలో ఆడపిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను కథాంశంగా చేసుకోని, దాన్ని ఓ అందమైన ప్రేమకథతో ముడిపెట్టి తెరపై ఓ చక్కటి దృశ్య కావ్యంలా ఆవిష్కరించిన చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. విజయ్‌ దేవరకొండ - రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి భరత్‌ కమ్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితం దక్కినప్పటికీ నటుడిగా విజయ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడా తాజాగా ఈ చిత్రంలోని నటనకు గానూ ఈ రౌడీ హీరో ఓ అవార్డును అందుకున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన 7వ ‘బిహైండ్‌వుడ్స్‌ గోల్డ్‌మెడల్‌ అవార్డ్స్‌’ కార్యక్రమంలో ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంలోని నటనకు గానూ బంగారు పతాకాన్ని అందుకున్నారు. దీన్ని కన్నడ స్టార్‌ హీరో యష్‌.. రౌడీకి అందజేశారు. తెలుగులో ఇదే చిత్రానికిగానూ రష్మిక ఉత్తమ కథానాయికగా అవార్డు గెలుచుకుంది. ఈ కార్యక్రమంలో గులాబీ రంగు షూట్‌ ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించార విజయ్‌. ప్రస్తుతం ఆయన క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.